Andhra Pradesh: భారత్ కు ఏపీ ఆదర్శంగా నిలవబోతోంది.. పేదలకు 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం!: మోదీ
- నవభారతానికి గుంటూరు కేంద్రం కానుంది
- విశాఖలో ఆయిల్ రిజర్వు ఏర్పాటు చేస్తున్నాం
- గుంటూరులో ప్రజా చైతన్య సభలో మోదీ వ్యాఖ్య
నవభారతం, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు గుంటూరు కేంద్రం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. దేశానికే ఏపీ ఆదర్శంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు. అందుకే వేలాది కోట్ల విలువైన పెట్రోలియం మౌలిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు. దీనివల్ల ఇంధన రంగంలో దేశానికి భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో, యుద్ధ సమయాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా దేశమంతటా వ్యూహాత్మక ఆయిల్ రిజర్వులను ఏర్పాటు చేస్తున్నామని మోదీ అన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడారు.
ఇలాంటి ఆయిల్ రిజర్వును విశాఖపట్నంలో ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను మరింత వాడుకలోకి తీసుకొచ్చేందుకు మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించామని మోదీ తెలిపారు. వీటివల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు వ్యాపారాలు పెరుగుతాయన్నారు. కాలుష్య రహిత, చవకయిన ఎల్పీజీ, సీఎన్జీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు.
నిన్న అస్సాంలో ఈశాన్య గ్యాస్ గ్రిడ్ ను ప్రారంభించామనీ, ఇప్పటికే పలు నగరాలను గ్యాస్ గ్రిడ్లతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. నవభారతాన్ని కాలుష్య రహిత భారతాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. త్వరలోనే ప్రజలు ఈ మార్పును గమనిస్తారనీ, భాగస్వాములు అవుతారని వ్యాఖ్యానించారు. దళిత, ఆదివాసీ, పేదలకు ఉజ్వల పథకం కింద 13 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో కేవలం 12 కోట్ల కనెక్షన్లు మాత్రమే ఇచ్చిందన్నారు.