Andhra Pradesh: అమరావతిని ‘ఆంధ్రా ఆక్స్ ఫర్డ్’ అనేవారు.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ!
- అగ్రగాములైన ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు
- గుర్రం జాషువా, తిక్కనలకు గుంటూరు జన్మినిచ్చింది
- ఏటుకూరు ప్రజా చైతన్య సభలో మోదీ
అక్షరక్రమంతో పాటు అన్ని రంగాలు, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మోదీ తెలుగులో మాట్లాడి ప్రజలను అలరించారు. దళితరత్నం, కవికోకిల గుర్రం జాషువా, మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం అని అన్నారు. ప్రజల స్నేహపూర్వక స్వాగతం, ఉత్సాహమే తనను చురుగ్గా పనిచేసేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఏటుకూరులో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడారు.
స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ సహా ఈ గడ్డపై జన్మించిన హేమాహేమీలకు నమస్కరిస్తున్నట్లు మోదీ తెలిపారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మార్గదర్శిగా, దిక్సూచిగా మారబోతోందని జోస్యం చెప్పారు. అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉందనీ, ఇక్కడి పురాతత్వ కట్టడాలను పరిరక్షించడానికి హృదయ్ పథకంలో చేర్చామన్నారు.
అమరావతిని గతంలో ఆంధ్రా ఆక్స్ ఫర్డ్ గా అభివర్ణించేవారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వచ్చేవారని తెలిపారు. త్వరలో తొలిసారి ఓటు హక్కును పొందనున్న యువత ఈ ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు.