Divorce: వినడానికి మాత్రం వింతే... పెళ్లయిన మూడు నిమిషాల్లోనే విడాకులు!

  • కువైట్ లో ఘటన
  • రిజిస్ట్రేషన్ తరువాత కాలు జారి కిందపడిన వధువు
  • దుర్భాషలాడిన వరుడు
  • వెంటనే విడాకులకు దరఖాస్తు, మంజూరు

మీరు చదివింది నిజమే... వివాహమైన ఓ జంట మూడంటే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. ఈ ఘటన కువైట్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కువైట్‌ లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు.

 ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం, కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడింది. పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి తన చేతిని అందించి సాయం చేయాల్సింది పోయి, కింద పడి పరువు తీశావంటూ, పరుష పదజాలానికి దిగాడు. దీంతో అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్క ఉదుటన జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడుగగా,  ఆయన వెంటనే మంజూరు చేసేశాడు.

కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. కువైట్‌ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంట వీరిదేనని స్థానిక మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. కాగా, గతంలో దుబాయ్ లో ఓ జంట పెళ్లయన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. ఇక, ప్రపంచంలో పెళ్లయిన అతి కొద్ది సమయంలోనే విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చేమో!

  • Loading...

More Telugu News