photos: కుంభమేళాలో భక్తులు స్నానం చేస్తున్న ఫొటోలు తీయకండి!: మీడియాకు అలహాబాద్ హైకోర్టు హెచ్చరిక
- స్నాన ఘట్టాలకు వంద మీటర్ల వరకు ఫొటోగ్రఫీ నిషేధం
- ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
- రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం
వార్తా పత్రికలు, టీవీ చానళ్లకు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. భక్తులు స్నానం చేస్తున్న ఫొటోలను చూపిస్తే ఇకపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో స్నానాలు చేస్తున్న ప్రదేశం నుంచి వంద మీటర్ల దూరం వరకు ఫొటోగ్రఫీని నిషేధించింది.
భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు కానీ, వీడియోలు కానీ తీయరాదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీనిని ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని పేర్కొంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులు, సంస్థలకు తెలియజేయాల్సిందిగా కుంభమేళా ప్రతినిధులను ఆదేశించింది.
కుంభమేళాలో భక్తులు స్నానాలు చేస్తుండగా మీడియా ఫొటోలు తీయకుండా ఆదేశించాల్సిందిగా హైకోర్టు న్యాయవాది అసీం కుమార్ రాయ్ వేసిన రిట్ పిటిషన్‌ను విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.