Sunnam Rajaiah: ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న తెలంగాణ నేత.. జనసేన మద్దతు?
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-68787ecae2a0d9da943761d7d4264e43e54dce47.jpg)
- 2014లో భద్రాచలం నుంచి గెలిచిన సున్నం రాజయ్య
- ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరం
- రంపచోడవరం నుంచి బరిలోకి?
తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉన్న సీపీఎం నేత సున్నం రాజయ్య ఈసారి ఏపీ నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో భద్రాచలం నుంచి విజయం సాధించిన ఆయన పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపి వేయడంతో ఆయన ఏపీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన వామపక్షాలతో పొత్తుపెట్టుకున్న నేపథ్యంలో రాజయ్య ఏపీ నుంచి పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి రాజయ్య సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. తమతో కలిసి వస్తున్న వామపక్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో రెండు సీట్లు ఇవ్వాలని పవన్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో రంపచోడవరం నుంచి సున్నం రాజయ్య, పి.గన్నవరం నుంచి సీపీఐ అభ్యర్థిగా తాటిపాక మధు నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.