USA: ఫర్మింగ్టన్ ఎఫెక్ట్... అమెరికా వరుడితో పెళ్లి రద్దు... గదిలో నుంచి బయటకు రాని తెలుగమ్మాయి!
- అమెరికా వెళ్లిన అమ్మాయి బ్యాగులో నకిలీ వర్శిటీ పత్రాలు
- వెంటనే అదుపులోకి తీసుకుని వెనక్కు పంపిన అధికారులు
- మనస్తాపంతో బాధపడుతున్న హైదరాబాద్ అమ్మాయి సుజాత
వారిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచిగా స్థిరపడిన తరువాతే పెళ్లాడాలని భావించారు. అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. అమ్మాయి కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధమైంది. వారి ప్రేమను అంగీకరించిన రెండు కుటుంబాలూ నిశ్చితార్థం కూడా జరిపించాయి. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా, దురదృష్టం వెంటాడగా, చేయని తప్పుకు పెళ్లి రద్దయింది. ఈ బాధతో ఆమె తన గదిలో నుంచి బయటకే రావడం లేదని బంధువులు వాపోతున్న పరిస్థితి.
మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన సుజాత అనే అమ్మాయి, అమెరికా వెళ్లింది. అయితే ఆమె లగేజీ బ్యాగులో అమెరికా అధికారులు ఏర్పాటు చేసిన నకిలీ యూనివర్సిటీ ఫర్మింగ్టన్ కు చెందిన కొన్ని పత్రాలుండగా, అధికారులు వాటిని గుర్తించారు. నెవార్క్ ఎయిర్ పోర్ట్ లో ఆమె అడుగు పెట్టగానే, కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, విచారించి, ఐదేళ్లు అమెరికాలో కాలు పెట్టకుండా నిషేధం విధించి, మరో విమానంలో ఇండియాకు పంపించారు.
చేసేదేమీ లేక ఆమె, దుబాయ్ మీదుగా ఇంటికి వచ్చింది. విషయం తెలిసి కుటుంబ సభ్యులు షాక్ కు గురికాగా, బంధువులు, స్నేహితులు చులకనగా మాట్లాడారు. తనకు కాబోయే భార్యపై అమెరికా నిషేధం విధించిందన్న విషయం అతనికి తెలియగానే, పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, తన గదిలో గడియ వేసుకుని బయటకు కూడా రావడం లేదు.
ఆమె ప్రస్తుతం ఎవరితోనూ మాట్లాడటం లేదని సుజాత బాబాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమెరికా అధికారులు ఎఫ్1 వీసా మోసం కేసులో సుజాత పేరును నమోదు చేశారని, కొన్ని పత్రాలపై తమ బిడ్డతో సంతకాలు చేయించుకున్నారని ఆయన తెలిపారు.