Andhra Pradesh: ఏపీలో ఇకపై బీపీ, షుగర్ రోగులకు ప్రైవేట్ మందుల షాపుల్లో ఉచితంగా మందులు
- ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
- ఇందుకోసం ప్రత్యేకంగా విధివిధానాలు
- రోగులకు ఆరు నెలలకోసారి రక్తపరీక్షలు తప్పనిసరి
దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలోని బీపీ, షుగర్ రోగులకు ప్రైవేట్ మందుల షాపుల్లో కూడా ఉచితంగా మందులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే, ఆరోగ్య శాఖ ఏపీ ఈఆర్ఎక్స్ యాప్ ద్వారా టీబీ రోగులకు ప్రైవేట్ మెడికల్ షాపుల ద్వారా మందులు అందిస్తోంది. ఇదే యాప్ ద్వారా బీపీ, షుగర్ రోగులకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీపీ, షుగర్ రోగులకు ఉచితంగా మందుల పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా విధివిధానాలు రూపొందించింది.
ఈ సేవలను రోగులకు అందించాలనుకున్న ప్రైవేట్ మెడికల్ షాపులు ఆరోగ్య శాఖ వద్ద ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా మందులు పొందాలనుకున్న రోగులు కచ్చితంగా ఆరు నెలలకోసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఆయా రోగాల కోసం పది రకాల మందులను సూచించడంతో పాటు వాటి రేట్ల వివరాలను ఈ జీవోలో పొందుపరిచింది. ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులకు వారానికోసారి ఆరోగ్య శాఖ బిల్లులను చెల్లించనుంది. ఈ సేవలపై లబ్ధిదారులు సంతృప్తి చెందినా లేక అసంతృప్తి చెందినా 1100 నంబర్ కు తెలియజేయాల్సిందిగా ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదిలా ఉండగా, ఐసీఎంఆర్, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా ఏపీలో సర్వే చేపట్టాయి. బీపీ, షుగర్ మందుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తుండటంతో రోగుల కుటుంబాలపై ఆర్థికభారం తీవ్రంగా ఉంటోందని ఈ సర్వేలో గుర్తించాయి. ఆయా మందులను ఉచితంగా అందించడం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్న సిఫారసుల మేరకు ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.