Andhra Pradesh: ఏపీలో మోదీ పర్యటనను అడ్డుకోం.. నిరసన మాత్రం వ్యక్తం చేస్తాం: రఘువీరారెడ్డి
- ప్రధాని మోదీ ఏపీకి ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు
- రేపు ఏపీలో ‘బ్లాక్ డే’ గా కాంగ్రెస్ పార్టీ పాటిస్తోంది
- మాకు అన్ని పార్టీలు సహకరించాలి
రేపు గుంటూరులో ప్రధాని మోదీ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాకే మోదీ ఇక్కడ అడుగు పెట్టాలని సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ ఏపీకి ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారని విమర్శించారు. మోదీ పర్యటనను, ఆయన సభను అడ్డుకోం కానీ, నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. రేపు ఏపీలో ‘బ్లాక్ డే’ గా కాంగ్రెస్ పార్టీ పాటిస్తోందని, అన్ని పార్టీలు తమకు సహకరించాలని కోరారు.
ఏపీలో జగన్ తో మోదీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మొన్న విజయనగరంలో జరిగిన అమిత్ షా సభకు ప్రజలెవ్వరూ రాలేదని, రేపు జరగనున్న మోదీ సభకు అదే పరిస్థితి ఎదురవుతుందని రఘువీరా ఎద్దేవా చేశారు. వైసీపీతో లాలూచీ పడ్డ బీజేపీ, ఈ సభకు జనాన్ని తరలించే యత్నం చేస్తోందని ఆయన చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ నెలాఖరుకు తమ అభ్యర్థులను ఖరారు చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తామని, సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని రాహుల్ గాంధీని కోరినట్టు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.