Andhra Pradesh: రాజ్ భవన్ కు చేరుకున్న జగన్.. ఓట్ల తొలగింపుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న ఏపీ ప్రతిపక్ష నేత!
- వైసీపీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు
- పోలీస్ అధికారుల పదోన్నతులపై కూడా ఫిర్యాదు
- ఇప్పటికే ఈసీని కలిసిన వైసీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుసుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వైసీపీ నేతలతో కలిసి జగన్ చేరుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతుదారుల ఓట్లను అక్రమంగా తొలగించడంతో పాటు బోగస్ ఓట్లపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
అలాగే ఇటీవల ఒకే సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారులకు పదోన్నతులు కల్పించిన విషయాన్ని నరసింహన్ దృష్టికి తీసుకెళతారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో నకిలీ ఓట్లను సృష్టించారనీ, ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని గవర్నర్ కు జగన్ వివరిస్తారు.
కాగా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సజావుగా జరగాలంటే రాష్ట్ర డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావులను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను జగన్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే.