Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు.. ఒకేరోజు 4 లక్షల ఇళ్లను ప్రారంభించనున్న చంద్రబాబు!
- నెల్లూరులో ఈరోజు ఇళ్ల పండుగ
- టాప్ ప్లేస్ లో తూర్పుగోదావరి
- షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నేడు ప్రారంభించనుంది. పేదలకు పక్కా ఇళ్లు అందించడంలో భాగంగా ఈరోజు ఒకేసారి 4 లక్షల ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు అందించనున్నారు. ‘ఇళ్ల పండుగ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఇళ్లను ప్రజలకు అందిస్తారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో లక్ష గృహాలను నిర్మించగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో మూడు లక్షల ఇళ్లను ప్రభుత్వం కట్టించింది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 39,169 గృహాలను, పట్టణ ప్రాంతాల్లో 13,844 ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందిస్తారు. ఏపీ అంతటా ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర కాలనీలో 4,800 ఇళ్లను చంద్రబాబు ఈరోజు ప్రారంభించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇప్పటికే అమరావతి నుంచి నెల్లూరుకు బయలుదేరారు. ఈ ఇళ్లను అపార్ట్ మెంట్ల తరహాలో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించారు.