TRS: టీఆర్‌ఎస్ కారు గుర్తు బోల్డ్ అవుతుందా... ఫిర్యాదును పరిశీలిస్తున్న ఎన్నికల కమిషన్
- ట్రక్కును పోలిన గుర్తుతో తమకు నష్టమన్న కేసీఆర్
- అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టం ఈసీ ముందుకు
- గుర్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పాలన్న సంఘం
ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన విధంగా ఉండే ట్రక్కు, ఇతర గుర్తుల వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ విషయంలో న్యాయం చేయాలంటూ తెలంగాణ అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై అధికారులు సానుకూలంగా స్పందించారు. మీ గుర్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఎంపీ వినోద్‌కుమార్ మార్పు చేసిన కారు గుర్తును ఎన్నికల సంఘానికి సమర్పించారు.
వివరాల్లోకి వెళితే... ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తు కేటాయించింది. అలాగే పార్వర్డ్ బ్లాక్ పోటీ చేయని కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు ఇదే గుర్తు కేటాయించింది. ట్రక్కు గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో చాలా మంది నిరక్షరాస్య గ్రామీణ ఓటర్లు పోల్చుకోవడంలో పొరబడ్డారని, దీనివల్ల తమ పార్టీకి భారీ నష్టం జరిగిందని గత ఏడాది డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలుచోట్ల ట్రక్కు గుర్తు కారు గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు సందేహ పడుతున్నారన్న వార్తలు రావడంతో అప్పట్లోనే టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆందోళన చెందింది. చేసేదేమీలేక వీలైనన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలకు వెళ్లింది. తీరా ఫలితాలు వచ్చాక పలు నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు పడిన ఓట్లు, అక్కడ ఆ గుర్తు అభ్యర్థికి ఉన్న బలం పరిశీలించి కంగుతింది.
రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పోటీ చేయగా సగటున 5,685 ఓట్ల చొప్పున మొత్తం 1,72,304 ఓట్లు పోలయ్యాయి. మానకొండూరులో 13,610, ధర్మపురిలో 13,114, నకిరేకల్‌లో 10,383, జనగామలో 10,031 ఓట్లు వచ్చాయి. ఓటర్లు గుర్తును గమనించడంలో జరిగిన పొరపాటువల్లే ఈ స్థాయిలో ఓట్ల తేడా జరిగిందన్నది టీఆర్‌ఎస్ అనుమానం. దీంతో గుర్తుపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.
కారు గుర్తును గుర్తించడంలో జరిగిన పొరపాటు కారణంగా చాలాచోట్ల తమ అభ్యర్థులు ఓడిపోయారని, లేదంటే తమ పార్టీ వంద సీట్ల మార్కును దాటి ఉండేదని ఎన్నికల కమిషన్‌కు తన ఫిర్యాదులో తెలిపింది. తదుపరి జరిగే ఎన్నికల్లో తమకు ఇలాంటి నష్టం జరగకుండా కారు గుర్తుకు మార్పు చేసుకునేందుకు అంగీకరించాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ఈసీ సూచనలను కోరింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.