west bengal: ఎన్నికలకు ముందు మోదీ చాయ్ వాలా, ఇప్పుడు రాఫెల్ వాలా: మమతా బెనర్జీ ఎద్దేవా
- మోదీ అధికారులందరూ ‘గుడ్ బై’ చెబుతున్నారు
- కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటాం.. వెనుకంజ వేయం
- ధర్నాలో ఆ పోలీస్ అధికారులు పాల్గొనలేదు
ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కోల్ కతాలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మోదీ ‘చాయ్ వాలా’ అని, ఇప్పుడేమో ‘రాఫెల్ వాలా’ అని విమర్శించారు. మోదీ పాలనలో ఆర్బీఐ నుంచి సీబీఐ వరకూ అధికారులందరూ గుడ్ బై చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునే విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు.
మమతా బెనర్జీ ఇటీవల చేపట్టిన ధర్నాలో ఆ రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులు ఐదుగురు పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేంద్రం చర్యలు తీసుకునే ఆలోచనపై ఆమె స్పందించారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. భద్రతాపరమైన అంశాలను చూసేందుకే వారు అక్కడికి వచ్చారే తప్ప, ధర్నాలో పాల్గొనలేదని అన్నారు. ఆ పోలీస్ అధికారులకు ఇచ్చిన పతకాలను కేంద్రం వెనక్కి తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అవార్డులతో వారిని సత్కరిస్తుందని స్పష్టం చేశారు.