kumaraswamy: ఆ టేపు నకిలీది.. నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు: యడ్యూరప్ప

  • కుమారస్వామి విడుదల చేసిన టేపు నకిలీది 
  • నాగనగౌడకు డబ్బు ఎరవేసేందుకు యత్నించాననే ఆరోపణల్లో నిజం లేదు
  • ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడకు మధ్యవర్తుల ద్వారా బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప డబ్బులు ఎరవేస్తున్నట్టుగా ఉన్న టేపును ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు కర్ణాటకలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ టేపుపై యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టేపు నకిలీదని, తనను ఇరికించేందుకే ఈ వీడియోను సృష్టించారని మండిపడ్డారు. నాగనగౌడకు డబ్బు ఎరవేసేందుకు యత్నించాననే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఆలయ దర్శనం కోసమే తాను దేవదుర్గకు వెళ్లానని... వెంటనే తిరిగి వచ్చానని అన్నారు. కానీ, నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడ తనను కలిసినట్టు, తనతో మాట్లాడినట్టు రికార్డు చేశారని మండిపడ్డారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి ఈ డ్రామాలు ఆడుతున్నారని యెడ్డీ అన్నారు. కుమారస్వామి ఓ సినీ నిర్మాత అని... వాయిస్ రికార్డింగ్ లో ఆయనకు మంచి నైపుణ్యం ఉందని... ఈ వీడియోను కూడా అలాగే సృష్టించారని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ కు కూడా డబ్బును ఆశజూపానని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

kumaraswamy
jds
yedyurappa
bjp
tape
Karnataka
  • Loading...

More Telugu News