Kerala: పోటీ చేయమని అడిగారు...నాకు ఆసక్తి లేదని చెప్పాను : జస్టిస్‌ కురియన్‌

  • ఎన్నికల బరిలో ఉంటారన్న వార్తలపై వివరణ ఇచ్చిన మాజీ న్యాయమూర్తి
  • చదువుకునే రోజుల్లో రాజకీయాలపై ఆసక్తి ఉండేది
  • ఆ తర్వాత పూర్తిగా న్యాయవృత్తికే పరిమితం

'కొన్ని రాజకీయ పార్టీలు తమ తరపున ఎన్నికల బరిలో నిలవాలని కోరిన మాట వాస్తవం. అయితే నాకు ఆసక్తి లేదని అప్పుడే చెప్పేశాను’... అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌  స్పష్టం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం పాలనా వ్యవస్థను విమర్శిస్తూ 2018 జనవరిలో నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ నలుగురిలో ఒకరు జస్టిస్‌ కురియన్‌.

 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన మాట్లాడారు. కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు అనధికారికంగా నన్ను కలిసి పోటీ చేయాలని అడిగినప్పుడే నాకు ఆసక్తి లేదని చెప్పానని తెలిపారు. విద్యార్థి దశలో ఉండగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న మాట వాస్తవమే అయినా ఆ తర్వాత పూర్తిగా న్యాయవృత్తికే తాను పరిమితమయ్యానని గుర్తు చేశారు. జస్టిస్‌ కురియన్‌ 2000లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు.

  • Loading...

More Telugu News