Andhra Pradesh: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కేఏ పాల్ వార్నింగ్.. మరోపక్క మీడియాపై చిందులు!
- ఫార్మింగ్టన్ వర్సిటీ విషయంలో చర్యలు తీసుకోవాలి
- లేదంటే నేను చర్యలు తీసుకుంటా-మీరు తట్టుకోలేరు
- నేనొకటి చెబితే స్టుపిడ్ మీడియా మరో హెడ్డింగ్ పెడుతోంది
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. అగ్రరాజ్యంలో ఫార్మింగ్టన్ అనే నకిలీ విశ్వవిద్యాలయం కేసులో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థులను విడుదల చేసేలా కొన్ని గంటల్లోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అది ట్రంప్ కు ఎంతమాత్రం రుచించబోదని స్పష్టం చేశారు.
కాగా, ఈ సందర్భంగా తన పక్కనే కూర్చున్న ఓ వ్యక్తి ఫోన్ మోగడంతో పాల్ సహనం కోల్పోయారు. ఆపండి అది అంటూ చేతితో గట్టిగా తట్టారు. అనంతరం తాను అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులు అందరూ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి రావాలని చెప్పారు.
అలాగే తాను ఒకటి మాట్లాడితే, కొంతమంది స్టుపిడ్, ఈడియట్ మీడియా వాళ్లు రకరకాల హెడ్డింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేశానన్నారు.