kalyanmalik: డబ్బులేక ఇంట్లో దేవుడి దగ్గర గురిగిలోని చిల్లరతో నెలంతా గడిపాము: కల్యాణ్ మాలిక్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8dce238cc567c4941d408022acc7240496a9a3f4.jpg)
- మొదటి నుంచి అవకాశాలు తక్కువే
- రావలసిన డబ్బు అందలేదు
- ఎవరినీ అడిగే ఆలోచనలేదు
సంగీత దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న కల్యాణ్ మాలిక్, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆర్ధికంగా తనకి ఎదురైన ఇబ్బందులను గురించి కూడా ప్రస్తావించారు. "మొదటి నుంచి ఇప్పటివరకూ నాకు సినిమా అవకాశాలు తక్కువే .. ఎందుకో తెలియదు. జీవితంలో డబ్బు చాలా అవసరం .. అది లేకపోతే చాలా పనులు కావు. నేను 'అంతకు ముందు ఆ తరువాత' సినిమా చేస్తోన్న సమయంలో ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
నాకు రావలసిన డబ్బు సమయానికి అందలేదు. అందువలన ఆ నెల గడపడం చాలా కష్టమైపోయింది. మేము పూజ చేసుకునే దేవుడి దగ్గర 'గురిగి'లో చిల్లర వేస్తూ ఉండేవాళ్లం. ఆ గురిగిని పగలగొడితే అందులో 1800 వరకూ వున్నాయి. ఆ డబ్బుతోనే ఆ నెలంతా గడిపాము. ఆ సమయంలో ఎవరిని అడిగినా డబ్బు సర్దుబాటు చేస్తారు. కానీ ఎవరిపై ఆధారపడకుండా అలాంటి పరిస్థితులను అధిగమించగలుగుతామా .. లేదా అనే ఆలోచనతో అలా నెట్టుకొచ్చేశాము" అని చెప్పుకొచ్చారు.