Jagan: నవరత్నాలను మేము కాపీ కొట్టడం కాదు.. మా పథకాలనే జగన్ కాపీ కొడుతున్నారు: కేఈ కృష్ణమూర్తి
- జగన్ రూ.3 వేలు ఇస్తామనడం కాపీ కాదా?
- 45 ఏళ్లకే పింఛన్ ఇస్తే ఇక ఉద్యోగాలతో పనేంటి?
- కర్నూలు జిల్లాలో పరిస్థితిని చంద్రబాబుతో చర్చించాం
జగన్ తమ పథకాలన్నింటినీ కాపీ కొడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. నేడు అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ నవ రత్నాలను టీడీపీ కాపీ కొట్టడం కాదని.. జగనే తమ పథకాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు రూ.2వేలు ఇస్తామంటే. జగన్ రూ.3 వేలు ఇస్తామనడం కాపీ కాదా? అని ప్రశ్నించారు.
ఉద్యోగానికి గరిష్ట అర్హత వయసు 45 ఏళ్లు అని... అలాంటిది వృద్ధాప్య పింఛన్‌ను 45 ఏళ్లకే ఇస్తే ఇక ఉద్యోగాలతో పనేంటని కేఈ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితిని బుధవారం చంద్రబాబుతో చర్చించినట్టు కేఈ తెలిపారు. కోట్ల ఫ్యామిలీ ఏయే సీట్లు అడుగుతోందనే విషయమై తమ మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తామని కేఈ పేర్కొన్నారు.