Jagan: డబ్బు మూటలతో గ్రామాల్లోకి చొరబడి.. మభ్యపెట్టడానికి సిద్ధమవుతారు.. జాగ్రత్త!: జగన్
- గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలు
- దొంగ సర్వేలతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారు
- కడప జిల్లా వైఎస్ఆర్‌ను గుండెల్లో పెట్టుకుంది
- 59 లక్షల బోగస్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు సూచించారు. నేడు ఆయన కడపలో సమర శంఖారావం సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారని.. డబ్బు మూటలతో గ్రామాల్లోకి చొరబడి.. ఓటుకు రూ.2 వేలు లేదంటే 3 వేలతో మభ్యపెట్టేందుకు సిద్ధమవుతారని విమర్శించారు. చంద్రబాబుకు వంతపాడుతూ ఎల్లో మీడియా, లగడపాటి దొంగ సర్వేలతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని దుయ్యబట్టారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని ధ్వజమెత్తారు.
31 ఏళ్లుగా కడప జిల్లా వైఎస్ఆర్‌ను గుండెల్లో పెట్టుకుందని.. ఆయన అకాల మరణం తరువాత తన కుటుంబానికి అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చంద్రబాబులో ఆందోళన పెరుగుతోందని.. ఓటర్ల నుంచి వైసీపీ మద్దతుదారుల పేర్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఓటరు లిస్టు చూసుకుని.. తమ ఓటు తొలగిపోయినట్టైతే మరోసారి నమోదు చేసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఏపీలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు జగన్ తెలిపారు. తనను కొడుకుగా ఆదరించిన ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తనపై ఉందని జగన్ పేర్కొన్నారు.