ap legislative council: ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎన్నిక లాంఛనం పూర్తి

  • అనుకున్నట్టే ఏకగ్రీవంగా ఎన్నికైన షరీఫ్‌
  • ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు
  • అధికారికంగా ప్రకటించిన ఇన్‌చార్జి చైర్మన్‌ సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశం శాసన మండలి చైర్మన్‌ ఎన్నిక లాంఛనం గురువారం పూర్తయింది. అనుకున్న విధంగానే టీడీపీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌  చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతలు షరీఫ్‌ను చైర్మన్‌ స్థానం వద్దకు తోడ్కొని వెళ్లగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఫరూక్‌ను మంత్రిగా, షరీఫ్‌ను చైర్మన్‌గా నియమించి మైనార్టీలకు రెండు కీలక పదవులు అప్పగించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి షరీఫ్‌ చేసిన సేవలు విలువైనవన్నారు. షరీఫ్‌ ఆధ్వర్యంలో మండలిలో వ్యవహారాలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు. షరీఫ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.

కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1955 జనవరి 1న షరీఫ్‌ జన్మించారు. స్థానిక వైఎన్‌ కళాశాలలో బీకాం, భోపాల్‌లో ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో పార్టీలో చేరారు. అప్పటి నుంచి వివిధ పదవులు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా గతంలో నియమించింది.

ap legislative council
chairman sharif
unanimous
  • Loading...

More Telugu News