Andhra Pradesh: మైలవరం పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ-టీడీపీ పోటాపోటీ ధర్నా.. ఉద్రిక్తత!
- కృష్ణా జిల్లాలో ముదిరిన ముడుపుల వ్యవహారం
- దమ్ముంటే ఆధారాలు చూపాలని వసంత కృష్ణప్రసాద్ సవాల్
- పోటీగా ధర్నాకు దిగిన టీడీపీ శ్రేణులు
కృష్ణా జిల్లాలోని మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి దేవినేని ఉమ ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని మైలవరం వైసీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఆయన మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. మైలవరం సీఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి ఉమ, ఆయన అనుచరులు చేస్తున్న కలప స్మగ్లింగ్ పై ఫిర్యాదు చేశామన్న కక్షతోనే తమపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. తాము కవర్లలో డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారనీ, దమ్ముంటే ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. కాగా, వైసీపీ ఆందోళనకు పోటీగా టీడీపీ కార్యకర్తలు మైలవరం పోలీస్ స్టేషన్ ముందుకు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.