Kotla: భారీ కాన్వాయ్ తో జగన్ వద్దకు బయలుదేరిన కోట్ల... వాహనాలు ఢీకొని ముగ్గురి మృతి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-6a2f36cc94c42f1a97596f8e5d2f4c35849fe985.jpg)
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి
- ఓర్వకల్లు వద్ద అదుపు తప్పిన కాన్వాయ్
- పలువురు కార్యకర్తలకు గాయాలు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తలంపుతో, తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్ తో వెళుతున్న వేళ అపశ్రుతి చోటు చేసుకుంది. కాన్వాయ్ లోని వాహనాలు అదుపుతప్పి ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొనడంతో ముగ్గురు మరణించారు.
కోడుమూరు నుంచి కడపకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి బయలుదేరిన వేళ, ఓర్వకల్లు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.