Telugudesam: ఎన్టీఆర్ లో అద్భుతమైన మూడు లక్షణాలు ఉన్నాయి: జయప్రకాష్ నారాయణ్
- సామాన్యులకు న్యాయం జరగాలన్న తపన ఎన్టీఆర్ ది
- ఎవరినైనా నమ్మితే ప్రాణమిచ్చే తత్వం ఆయనది
- ఎన్టీఆర్ కు అపారమైన ధైర్యం, సంకల్ప బలం ఉన్నాయి
మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ లో అద్భుతమైన మూడు లక్షణాలు ఉన్నాయని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ) అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పని చేసిన జేపీకి ఆయనతో మంచి అనుబంధం వుంది.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ లో ఉన్న మూడు అద్భుత లక్షణాల్లో ఒకటి.. ఈ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలని, దాని కోసం ఎంతకష్టమైనా పడాలన్నది. ఆ తపన అద్భుతమైంది.
రెండోది.. ఏ రంగంలో అయినా సరే, అవతలి వ్యక్తి మంచి వాడు, నిజాయతీ పరుడు, ప్రజల కోసం పనిచేస్తాడని ఆయన నమ్మితే ప్రాణమిచ్చే తత్వం. అప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలను పట్టించుకోరు.
మూడోది.. నమ్మిన అంశాల మీద ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా పోరాడేందుకు ఉన్న అపారమైన ధైర్యం, సంకల్పబలం.
దేశంలో నా లాంటి వాళ్లు పాండిత్యంతో చెప్పే చాలా అంశాలు.. జీవితానుభవంతో కూడిన కామన్ సెన్స్ ఉన్న అలాంటి వాళ్లు ఎప్పుడో చెప్పారు. అసలు, గవర్నమెంట్ ఎందుకండి వ్యాపారంలో జోక్యం చేసుకోవడం? అంటూ మొట్టమొదట మాట్లాడిన వాళ్లలో ఎన్టీఆర్ ఒకరు.
దేశంలో1991లో ఆర్థిక సరళీకరణ వచ్చింది. అది రావడానికి పదేళ్లకు ముందే ఎన్టీఆర్ లాంటి వాళ్లు, అంతకు ముందు రాజాజీ గారి లాంటి వాళ్లు ‘నా జీవితంలో గవర్నమెంట్ పెత్తనమేంటి.. నీ పని నువ్వు చెయ్యి’ అని వాదించారు. రాజాజీగారు బోల్డంత పాండిత్యం, అవగాహన, అనుభవంతో వాదించారు. ఎన్టీఆర్ గారు కామన్ సెన్స్ తో వాదించారు. చిత్తశుద్ధితో రాజకీయం చేసిన వాళ్లందరిలో కూడా చాలా బలాలు ఉన్నాయి. మనం వాళ్లను ఊరికే అవమానించడం, విమర్శించడం కాకుండా, తప్పును విమర్శిద్దాం.. సరిచేద్దాం. కానీ, మంచిని స్వీకరిద్దాం’ అని చెప్పుకొచ్చారు.