Uttar Pradesh: ముజఫర్ నగర్ నిందితులపై కేసుల మాఫీ.. తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ!
- 2013లో యూపీలో మత ఘర్షణలు
- 62 మంది దుర్మరణం , ఇళ్లొదిలి వెళ్లిపోయిన 50 వేల మంది
- రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్న ఒవైసీ
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో 2013లో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో 38 మంది నిందితులపై కేసులను ఎత్తివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు దీన్ని కీలక నిర్ణయంగా అభివర్ణించడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
ఈ విషయమై ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఇది నిజంగా గొప్ప రాజకీయ నిర్ణయం కాదు. ఈ నిర్ణయం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవటమే. తాను ఊహించినట్లు హిందుత్వ నినాదం పనిచేయడం లేదని యోగి టెన్షన్ పడుతున్నారు. ముజఫర్ నగర్ అల్లర్ల సందర్భంగా రేప్, హత్యలతో చితికిపోయిన బాధితులకు న్యాయం జరగాలి. ప్రస్తుతం దేశంలో హిందూయిజం లేదా ఇస్లాం ప్రమాదంలో లేవు. న్యాయం ప్రమాదంలో ఉంది’ అని ట్వీట్ చేశారు.
2013, ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 మధ్యలో ముజఫర్ నగర్ లో ఈ అల్లర్లు చెలరేగాయి. అల్లర్లు తీవ్రం కావడంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత కేంద్రం ఆర్మీని రంగంలోకి దించింది. ఈ అల్లర్ల నేపథ్యంలో 62 మంది ప్రాణాలు కోల్పోగా, 50,000 మంది ప్రాణభయంతో ఇళ్లు వదిలి పారిపోయారు.