modi: మీ కుమారుడి ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయి.. ఒక్క విచారణ అయినా జరిపారా?: అమిత్ షాకి చంద్రబాబు ప్రశ్న

  • నాలుగేళ్ల క్రితం మీరెక్కడున్నారు? ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా?
  • కలసి పని చేద్దామని మోదీయే నన్ను అడిగారు
  • పలాసలో అమిత్ షా సభకు జనాలే రాలేదు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. అమిత్ షా కుమారుడి ఆస్తులు గత నాలుగేళ్లలో 16వేల రెట్లు పెరిగాయని... కానీ, ఒక్క విచారణ కూడా జరపలేదని మండిపడ్డారు. విపక్ష నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల కింద మీరు ఎక్కడున్నారని... ఢిల్లీకి రాగానే కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నించారు. తనను విమర్శించే నైతికత అమిత్ షాకు లేదని చెప్పారు. కావాలంటే బీజేపీని పొగుడుకోవాలని... తనను విమర్శించే హక్కు మాత్రం మీకు లేదని అన్నారు.

2014లో ఇద్దరం కలసి పని చేద్దామని మోదీయే తనను అడిగారని... బీజేపీతో కలుస్తామని మేము అడుక్కున్నట్టు అమిత్ షా అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారనే భావనతోనే బీజేపీతో చేతులు కలిపామని చెప్పారు. ఇప్పుడున్నది విలువలతో కూడిన పాత బీజేపీ కాదని... మోదీ, అమిత్ షాల బీజేపీ అని అన్నారు. రాష్ట్రానికి మేలు చేయమని అడిగితే... తమపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. పెళ్లాన్నే సరిగా చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని నితిన్ గడ్కరీనే అన్నారని ఎద్దేవా చేశారు.

పలాసలో జరిగిన అమిత్ షా సభకు జనాలే లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తనది యూ టర్న్ కాదని... రైట్ టర్న్ అని చెప్పారు. బీజేపీనే వంకరటింకర టర్న్ లు తీసుకుంటోందని విమర్శించారు. తన కుమారుడి పదవి కోసం తాను ఏదేదో చేస్తున్నానని అంటున్నారని... తనకు అంత అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లతో తనది జన్మజన్మల బంధమని తెలిపారు.

  • Loading...

More Telugu News