Tamil Nadu: తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ప్రియాంకకు మరో బాధ్యత?
- పార్టీని బతికించేందుకు ఇదే మంచిదన్న ఆలోచనలో అధిష్ఠానం
- ఇటీవల సూచన ప్రాయంగా చెప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు
- త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం
‘పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా సోదరి ప్రియాంక వాద్రాపై దేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే బాధ్యత ఉంది’...ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నమాటలు త్వరలో అమల్లోకి రానున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరికొన్ని రోజుల్లోనే తమిళనాడు పార్టీ పగ్గాలు ప్రియాంక చేతుల్లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ముకుల్ వాస్నిక్‌ను తప్పించి ప్రియాంకను నియమిస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేను గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తుండడంతో కాంగ్రెస్ అప్రమత్తమయ్యింది.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇది ముఖ్యమైన సమయంగా భావించిన రాహుల్ ఇటీవలే టీపీసీసీ అధ్యక్షునిగా కె.ఎస్.అళగిరిని నియమించారు. రాష్ట్రంలో సీనియర్ నేతలు చిదంబరం, ఇళంగోవన్, తిరునావుక్కరసర్ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అందరినీ కట్టడిచేసి ఒక తాటిపై నడిపించేందుకు తన సోదరి ప్రియాంక అజమాయిషీ అక్కరకు వస్తుందన్నది రాహుల్‌గాంధీ యోచనగా చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించడంతో తిరునావుక్కరసర్ తిరుగుబాటు ఎగురవేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనూ ప్రియాంక నియామకాన్ని సత్వరం చేపట్టాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని తెలుస్తోంది. ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా ముందు రాష్ట్రంలోని పార్టీ శ్రేణున్నింటినీ ఒక్కతాటిపైకి తేవొచ్చని, ఆ తర్వాత డీఎంకేతో సయోధ్య నెరపి ఎన్నికలకు వెళ్లడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చునన్నది రాహుల్ వ్యూహంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.