Andhra Pradesh: జోరు పెంచిన జగన్.. నేటి నుంచి తిరుపతిలో ‘సమర శంఖారావం’!
- పార్టీ కేడర్ పై వైసీపీ అధినేత దృష్టి
- ఈరోజు కార్యకర్తలు, తటస్థులతో భేటీ
- ఏర్పాట్లు పూర్తిచేసిన వైసీపీ శ్రేణులు
ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి విస్తృతంగా దూసుకెళ్లిన వైసీపీ అధినేత జగన్.. తాజాగా పార్టీని పటిష్టం చేసే దిశగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేటి నుంచి ‘సమర శంఖారావం’ పేరుతో వైసీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈరోజు తిరుపతిలో వైసీపీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో జగన్ తొలుత సమావేశమవుతారు. అనంతరం స్థానిక ఓట్లను ప్రభావితం చేయగల తటస్థులతో భేటీ అవుతారు.
రేపు వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది. అలాగే ఈ నెల 11న అనంతపురం, 13న ప్రకాశం జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. అయితే నెల్లూరులో ఈ నెల 12న జరగాల్సిన సమర శంఖారావం సభ వాయిదా పడింది. ఈరోజు తిరుపతి పర్యటనలో భాగంగా జగన్ తొలుత ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని తనపల్లి క్రాస్ వద్ద గల పీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో తటస్థ ప్రముఖులతో భేటీ అవుతారు. అనంతరం రేణిగుంట సమీపంలోని యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుని పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో భేటీ అవుతారు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురామ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు.