Pope: నిజమే.. సన్యాసినులను కొందరు బిషప్ లు, పాస్టర్లు లైంగికంగా వేధిస్తున్నారు: పోప్ ఫ్రాన్సిస్ సంచలన ఆరోపణ
- క్యాథలిక్ చర్చ్ లలో వేధింపులు
- నిజమేనని అంగీకరించిన ఫ్రాన్సిస్
- పరిస్థితి మారాలని అభిలాష
క్యాథలిక్ చర్చ్ లలో సన్యాసినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని పోప్ ప్రాన్సిస్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీస్టులు, బిషప్ లు నన్స్ ను వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం సర్వసాధారణమైపోయిందని ఆయన అన్నారు. "కొంతమంది మతాధికారులు, బిషప్ లు ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత విచారకరం" అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించిన ఆయన, తిరుగు ప్రయాణంలో మీడియాతో మాట్లాడారు. సన్యాసినులపై లైంగిక వేధింపులను ప్రస్తావించారు.
కాగా, వాటికన్ ఉమన్ మేగజైన్ లో గతవారం సన్యాసినులపై లైంగిక వేధింపులంటూ ప్రచురితమైన ప్రత్యేక కథనం తీవ్ర కలకలం రేపింది. సర్వస్వమూ త్యాగం చేసి, దైవ సేవలో గడుపుదామని వచ్చే అతివలను పాస్టర్లు, బిషప్ లు వేధించుకుతింటున్నారని చెబుతూ స్టోరీని ప్రచురించింది. వారి వేధింపుల కారణంగా తాము బిడ్డల తల్లులమైతే, వారికి తండ్రులుగా అంగీకరించేందుకు కూడా బిషప్ లు అంగీకరించడం లేదని సన్యాసినులు వాపోతున్నట్టు తెలిపింది. తమ బిడ్డలను తండ్రి లేని అనాధలుగా పెంచాల్సి వస్తోందని వారు ఆరోపించారని పేర్కొంది.
కాగా, ఈ తరహా వేధింపులు ఇండియాలోనూ జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. కేరళలోని ఓ బిషప్ తనను పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఓ సన్యాసిని ఆరోపించిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
ఇక నన్స్ రక్షణ కోసం చర్చ్ లు కీలక చర్యలు చేపట్టాల్సి వుందని ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. కేవలం కొన్ని చర్చ్ లలో మాత్రమే ఈ సమస్య ఉందన్న ఆయన, మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం, కఠిన చర్యలు చేపట్టడం ద్వారా వీటిని అరికట్టవచ్చని అన్నారు. ఇది తీవ్రమైన సమస్య కాకముందే క్యాథలిక్ సంఘాలు స్పందించాలని సలహా ఇచ్చారు. మహిళను విలాస వస్తువుగా చూడటం మానుకోవాలని పిలుపునిచ్చారు.