Nara Lokesh: నారా లోకేష్ పై ఏబీఎన్ స్టోరీ... కామెడీ సెటైర్లు వేసిన నటుడు నాగబాబు.. వీడియో ఇదిగో!
- ఇటీవల దావోస్ లో పర్యటించిన లోకేశ్
- ప్రత్యేక కథానాన్ని ప్రచురించిన ఏబీఎన్
- వ్యంగ్యాస్త్రాలు సంధించిన నాగబాబు
ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేశ్ దావోస్ లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోకేశ్ కు ఓ వింత అనుభవం ఎదురైందని, దాంతో మైనస్ 15 డిగ్రీల చలిలోనూ వారిలో వేడి పుట్టిందని చెబుతూ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ఓ కథానాన్ని చూపిస్తూ, నటుడు నాగబాబు కామెడీ సెటైర్లు వేశారు. 'మై చానల్ నా ఇష్టం' అంటూ యూట్యూబ్ లో ఓ చానల్ ను ప్రారంభించిన ఆయన, పలువురిపై ఇప్పటికే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. తాజా వీడియోలో లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నారాయన.
లోకేశ్ తో సమావేశమైన ఓ పారిశ్రామికవేత్త ఏపీలో రూ. 5 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నామని మోదీకి చెప్పగా, ఆయన వాటిని గుజరాత్ లో పెట్టాలని కోరారని, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు బులెట్ రైలు రానుందని మోదీ చెప్పారని ఏబీఎన్ లో వ్యాఖ్యానించడాన్ని చూపించిన నాగబాబు, "అది... ఈ మోదీ గారికి ఏ పనీ పాటా లేదు. మన ఆంధ్రప్రదేశ్ కు ఏ పెట్టుబడి వచ్చినా, ఆయనేమో తీసుకుపోయి గుజరాత్ లో పెట్టించేస్తారు. ఆయనేమో పీఎం పని మానేసి ఈ పని చేస్తున్నారంట. చూడండి. ఏబీఎన్ వారు ఎంత చక్కగా న్యూస్ చెబుతున్నారో. మనకు ఎవరికీ తెలియని న్యూస్... అన్యాయం మోదీ గారూ" అని అన్నారు.
ఆపై 'కియా' కంపెనీ కార్లు ఇంకా తయారు కాలేదు. కొరియా నుంచి తెచ్చిన కార్లను ఊరిలో తిప్పించారట... నిజమేనా అంటూ, ఏమోలే ఏబీఎన్ చెప్పిందంటే నిజమే అయ్యుంటుందని అన్నారు. ఆపై రెండు చిడతలను తీసుకుని ఆ కథనం వస్తున్నంతసేపూ వాటిని తనదైన శైలిలో కొడుతూ, "అదండీ... అది" అంటూ సెటైర్లు వేశారు. లోకేశ్ బాబు విషయంలో కన్న తండ్రికన్నా ఏబీఎన్ చానల్ వాళ్లు పొంగిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వీడియోను మీరూ చూడండి.