Kishore Chandradev: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్... పచ్చ కండువా కప్పుకోనున్న కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్!

  • గతంలో ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికైన చంద్రదేవ్
  • ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
  • త్వరలోనే తెలుగుదేశంలో చేరే అవకాశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గతంలో ఐదుసార్లు లోక్ సభకు, ఓ మారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన, గనులు, ఉక్కు, బొగ్గు శాఖల సహాయమంత్రిగా, ఆపై గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగానూ పనిచేశారు. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను చంద్రదేవ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ తరఫున అరకు నుంచి పోటీపడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కొత్తపల్లి గీత చేతిలో ఓడిపోయారు. ఆపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన, పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఆదివారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పారు.

కాగా, అరకు ప్రాంతంలో బలమైన పార్టీ అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం నేతలు ఇప్పటికే కిశోర్ చంద్రదేవ్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన్ను ఆహ్వానించాలని చంద్రబాబు చేసిన సూచన మేరకు సీనియర్ నేతలు చంద్రదేవ్ ను కలవగా, ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. వాస్తవానికి అరకు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు నామమాత్రమే. అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారు టీడీపీలో చేరగా, చంద్రదేవ్ రాకతో పార్టీ మరింతగా బలపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, తాను టీడీపీలో చేరే విషయమై కిశోర్ చంద్రదేవ్‌ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. తాను త్వరలోనే ఈ విషయమై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మాత్రమే ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News