Pakistan: ఈ భూమ్మీద నేనే అత్యంత చెత్త కెప్టెన్‌నని అనుకున్నా: డేవిడ్ మిల్లర్
- రెండో టీ20లో విజయం ముంగిట పాక్ బోల్తా
- ప్రత్యర్థి విజయానికి దగ్గరవుతుంటే ఏం చేయలేకపోయామన్న సఫారీ కెప్టెన్
- బాబర్ ఆజం ఒంటరి పోరు వృథా
దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టీ20కి కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ మిల్లర్ జట్టును విజయ పథంలో నడిపించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సఫారీలు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.
జొహెన్నెస్‌బర్గ్‌లోని వాండరెర్స్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ మిల్లర్ చెలరేగి ఆడాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు.
189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఒకానొక దశలో 174/5తో విజయానికి చేరువైంది. ‘‘నిజంగా అప్పుడేం చేయాలో నాకు తోచలేదు. వారు విజయానికి దగ్గరవుతున్నారు. బంతితో మేం వారిని అడ్డుకోలేకపోతున్నాం. అప్పుడనిపించింది.. ఈ భూమ్మీద నేను అత్యంత చెత్త కెప్టెన్‌నని’’ అని మ్యాచ్ అనంతరం మిల్లర్ పేర్కొన్నాడు.
కాగా, 180/6తో బలంగా కనిపించిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలవడం గమనార్హం. పాక్ ఓపెనర్ బాబర్ ఆజం 90 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి నుంచి జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిల్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు లభించింది.