rohini: బాలనటిగా 200 సినిమాలు చేశాను: నటి రోహిణి
- నా ఫస్టు మూవీ 'యశోద కృష్ణ'
- నటిగా ఓ 400 సినిమాలు చేసి వుంటాను
- డబ్బింగ్ చెప్పిన ఫస్టు సినిమా 'గీతాంజలి'
బాలనటిగా దాదాపు 200 చిత్రాల్లో నటించిన ఘనత రోహిణి సొంతం. ఆ తరువాత కథానాయికగా ఆమె మలయాళంలో చాలా సినిమాలు చేశారు. నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రోహిణికి మంచి పేరుంది. ఒక వైపున కథానాయికలకు తన గొంతును అరువిస్తూనే .. మరో వైపున ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలాంటి రోహిణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మాది 'అనకాపల్లి .. అక్కడే పుట్టాను .. చెన్నైలో పెరిగాను. నేను సినిమాల్లో చేయాలని మా నాన్నగారికి ఉండేది. ఆయన ఇంట్రెస్ట్ తోనే నాకు 'యశోదకృష్ణ'లో కృష్ణుడిగా అవకాశం వచ్చింది .. నా తొలి సినిమా అదే. ఆ తరువాత ఇంతవరకూ తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు కలుపుకుని 350 నుంచి 400 సినిమాల వరకూ చేశాను. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగులో నేను డబ్బింగ్ చెప్పిన తొలిమూవీ మణిరత్నం గారి 'గీతాంజలి'. ఆ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.