Mamata Banerjee: మమతా బెనర్జీ సత్యాగ్రహ దీక్షకు చంద్రబాబు సంఘీభావం.. మధ్యాహ్నం కోల్‌కతాకు ఏపీ సీఎం
- కొనసాగుతున్న మమత దీక్ష
- సీబీఐ పిటిషన్‌పై నేడు సుప్రీం నిర్ణయం
- సర్వత్ర ఆసక్తి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి సీఎం మమతా బెనర్జీని కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ‘సత్యాగ్రహ’ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. మోదీ వర్సెస్ దీదీగా మారిన రాజకీయ పరిణామాలకు కారణమైన శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ స్కాంలపై దర్యాప్తు కొనసాగించడానికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్‌ను నేడు విచారించనున్న న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రకటించనుంది.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై పడింది. సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ ప్రశ్నిస్తుంది. వ్యతిరేకంగా వస్తే మమత గెలిచినట్టు అవుతుంది. మరోవైపు, బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోదీ, అమిత్ షా దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు.