new delhi: ఈసీ అధికారులను ఇరవై మూడు పార్టీల ప్రతినిధులం కలిశాం: సీఎం చంద్రబాబు
- ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి
- పేపర్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాలి
- ఈసీ సరైన నిర్ణయం తీసుకుంటుందని నమ్మకం
ఇరవై మూడు పార్టీల ప్రతినిధులం ఈసీ అధికారులను కలిశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులతో విపక్షాల సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, ఈవీఎంలపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమైన విషయాన్ని అధికారులకు స్పష్టం చేశామని అన్నారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ పద్ధతే పాటిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చామని అన్నారు.
పోలైన ఓట్లలో 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్స్ లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామని, వీటిని లెక్కించడమన్నది పెద్ద విషయమేమీ కాదని సూచించారు. ప్రజాస్వామ్యం కోసం ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని, ఈవీఎం యంత్రాల్లో ఒక పార్టీ గుర్తు నొక్కితే మరో పార్టీకి వెళ్తున్నాయని, దీనిపై ప్రతి ఒక్కరిలో సందేహాలున్నాయని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, తద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.