selfie: చిన్నారుల ఉత్తుత్తి సెల్ఫీకి సెలెబ్రిటీలు ఫిదా!
- సెల్ఫీ దిగుతున్నట్టుగా ఫీలైన ఐదుగురు చిన్నారులు
- సెల్ ఫోన్ బదులు చేతిలో స్లిప్పర్ పట్టుకున్న వైనం
- సామాజిక మాధ్యమాలకు చేరిన ఈ ఉత్తుత్తి సెల్ఫీ
చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ లేకుండా కనిపించని రోజులివని చెప్పడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. అవసరమైన సమాచారంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ ను అందించే సాధనంగా ఉన్న సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరైంది. ఇక, తమ సెల్ ఫోన్ల ద్వారా ‘సెల్ఫీ’ దిగేవారికీ కొదవలేదు. ఇంట్లో ఉన్నా.. బయటకెళ్లినా, బస్సెక్కినా.. బండి నడిపినా, ఫంక్షన్ చేసినా.. ప్రముఖులను కలిసినా.. ఇలా ‘సెల్ఫీ’ దిగడం తప్పనిసరైన రోజులివి. చేతిలో సెల్ ఫోన్ ఉండి.. సెల్ఫీ దిగాలనుకుంటే సరే, ఒకవేళ, సెల్ ఫోన్ కొనలేని వారి పరిస్థితి ఏంటి? ఆ సరదాను ఎలా తీర్చుకుంటారనడానికి ఉదాహరణే ఈ చిత్రం.
ఐదుగురు చిన్నారులు.. సెల్ఫీ దిగుతున్నట్టుగా ఫీలవుతూ, చిరునవ్వులు చిందించారు. ఓ చిన్నారి ఓ స్లిప్పర్ (చెప్పు)ను సెల్ ఫోన్ మాదిరి తన చేతిలో ఉంచుకోగా, మిగిలిన నలుగురు చిన్నారులు అటువైపే చూస్తూ నవ్వుతూ ఉత్తుత్తి సెల్ఫీ దిగారు. ఈ దృశ్యాన్ని గమనించిన ఎవరో తన ఫోన్ లో ‘క్లిక్’ మనిపించాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరింది. బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, సునీల్ శెట్టి తదితరులు ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ‘మీరు ఎంచుకున్న దాన్ని అనుసరించే మీరు సంతోషంగా ఉంటారు’ అని బొమన్ ఇరానీ ఆ ఉత్తుత్తి సెల్ఫీకి క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. అమితాబ్ మాత్రం ఈ ఫొటోపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఫొటోషాప్ లో చేసిన గిమ్మిక్కు ఏమోనన్న అనుమానం ఉందన్నారు.