CBI: సీబీఐ కొత్త డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లా బాధ్యతల స్వీకరణ
- నాగేశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించిన శుక్లా
- శుక్లాను అభినందించిన పలువురు అధికారులు
- ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్న శుక్లా
సీబీఐ నూతన డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ సీబీఐ కేంద్ర కార్యాలయంలో తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు నుంచి ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయన్ని అభినందించారు. ఈరోజు నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. కాగా, గ్వాలియర్ లో రిషికుమార్ శుక్లా జన్మించారు. 1983 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆయన. ఎంఏ ఫిలాసఫీ చదివారు. 1985లో తొలిసారిగా రాయ్ పూర్ ఏఎస్పీగా నియమితులయ్యారు. రాయ్ పూర్, భిలాయ్, దామోహ్, శివ్ పురి, మందసోర్ లాంటి ప్రాంతాల్లో ఎస్పీగా ఆయన పనిచేశారు.
2015 నుంచి 2016 వరకు మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సేవలందించారు. 1992 నుంచి 1996 వరకు డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోనూ, 2009 నుంచి 2012 వరకు ఇంటెలిజెన్స్ ఏడీజీగానూ శుక్లా పని చేశారు. 1995లో క్రైసిస్ మేనేజ్ మెంట్ పై, 2005లో హోస్టెస్ నెగోషియేషన్స్ పై అమెరికాలో శిక్షణ తీసుకున్నారు. సీబీఐలో పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి.