Narendra Modi: నేనెప్పుడూ తనకు దగ్గరగా ఉండాలని మా అమ్మ కోరుకుంటుంది!: ప్రధాని మోదీ
- పీఎం అయ్యేటప్పటి కంటే సీఎం అయినప్పుడే ఆమె సంతోషించింది
- ముఖ్యమంత్రి పేరు ప్రకటించాక వెళితే చాలా ఆనందపడింది
- మళ్లీ నా చేరువకు వస్తున్నావని ముచ్చటగా చెప్పింది
‘అమ్మ మనసు వెన్నవంటిది. ఆమె మనసెప్పుడూ పిల్లల చుట్టూనే తిరుగుతుంది. వారెప్పుడూ తనకు సమీపంలోనే ఉండాలని కోరుకుంటుంది. ఈ కారణంగానే ఏమో అమ్మ నేను ప్రధాని అయ్యే రోజు కంటే ముఖ్యమంత్రి అవుతున్నాను అని తెలిసిన రోజే ఎక్కువ సంతోషపడింది’ అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే ఫేస్‌బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు రోజును మోదీ గుర్తు చేసుకున్నారు. చాలా సందర్భాల్లో మీరు ప్రధాని అవుతున్నారని తెలిసినప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీలయ్యారని అడుగుతుంటారని, కానీ అమ్మ నేను సీఎంగా ఉన్నప్పుడే ఎక్కువ ఆనందించారని తెలిపారు.
"గుజరాత్ సీఎంగా నా పేరు ప్రకటించడానికి ముందు నేను ఢిల్లీలో ఉన్నాను. నా పేరు ప్రకటించాక అమ్మను కలిసేందుకు నేరుగా అహ్మదాబాద్ వెళ్లాను. ఆ క్షణంలో అమ్మ కళ్లలో కనిపించిన ఆనందం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పటికే ఇంటివద్ద ఎంతోమంది గుమిగూడడంతో ఆ వాతావరణం సందడిగా ఉంది. అంతమందిలో అమ్మ నన్ను కౌగిలించుకుని మురిసిపోయింది. ఇకపై నువ్వునాకు దగ్గరగా ఉంటావన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. అంటూ పొంగిపోయింది" అంటూ మోదీ తెలిపారు.
ఆ సందర్భంలో అమ్మ నాకో మాట కూడా చెప్పారు. ‘నువ్వు ఏం చేస్తావో తెలియదుగాని, జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోనని నాకు మాటివ్వు’ అని కోరారు. 'ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. అమ్మకు అప్పట్లో ఇచ్చిన మాటను జవదాటకుండా ప్రధాని అయ్యాక కూడా ఇప్పటికీ అవే విలువలు పాటిస్తున్నాను' అని మోదీ వివరించారు.
‘నేను ప్రధానినా? ముఖ్యమంత్రినా? అన్నది కాదు అమ్మకు కావాల్సింది, నిజాయతీగా దేశమాతకు సేవలందించాలని ఆమె కోరుకుంటారు. ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు అనుక్షణం పనిచేస్తున్నాను’ అని తెలిపారు.