modi: పద్మభూషణ్ వెనక్కి ఇచ్చేస్తానంటూ మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన అన్నా హజారే!
- దేశాన్ని మోదీ ప్రభుత్వం దారుణంగా వంచించింది
- దేశ పరిస్థితి ఘోరంగా ఉన్నప్పుడు.. నాకు పద్మ భూషణ్ ఎందుకు?
- ఇచ్చిన హామీలను కొన్ని రోజుల వ్యవధిలో పరిష్కరించాలి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చకుంటే... తనకు ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరించారు.
గత బుధవారం నుంచి అన్నా హజారే నిరాహార దీక్షకు దిగారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరశన దీక్ష చేపట్టారు. లోక్ పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొన్ని రోజుల వ్యవధిలోనే నెరవేర్చాలని... లేకపోతే, తనకు ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతికి అందజేస్తానని చెప్పారు. దేశ ఉన్నతి కోసం, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినందు వల్లే తనకు పద్మభూషణ్ దక్కిందని... దేశ పరిస్థితి ఇంత ఘోరంగా మారిపోయినప్పుడు... ఆ పురస్కారాన్ని తన వద్ద ఎందుకు ఉంచుకోవాలని ప్రశ్నించారు. దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం దారుణంగా వంచించిందని మండిపడ్డారు.
అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ స్థాయిలో లోక్ పాల్ ను, రాష్ట్రాల స్థాయుల్లో లోకాయుక్తలను నియమించాలని 81 ఏళ్ల అన్నా హజారే డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 1992 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. మరోవైపు, నిరాహార దీక్ష కారణంగా గత ఐదు రోజుల్లో 3.8 కిలోల బరువును అన్నా కోల్పోయారు. ఆయన బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు తెలిపారు.