Philippines: బాప్‌రే!.. ఫిలిప్పీన్స్ ప్రజలు రోజులో పది గంటలు ఇంటర్నెట్ మీదేనట!
- ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో బ్రెజిల్
- ఇంటర్నెట్ కోసం అతి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్న జపాన్ ప్రజలు
- ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 6.5 గంటల వినియోగం
ఇంటర్నెట్ వినియోగంలో ఫిలిప్పీన్స్ ప్రజలు రికార్డు సృష్టించారు. రోజులో ఏకంగా పది గంటల రెండు నిమిషాలు ఇంటర్నెట్ మీదే గడిపేస్తున్నారట. ఈ భూమ్మీద దక్షిణాసియా దేశమైన ఫిలిప్పీన్‌స్ ను మించి మరే దేశమూ అంత పెద్ద మొత్తంలో ఇంటర్నెట్‌ను వినియోగించడం లేదని ‘హూట్‌సూట్ అండ్ వియార్ సోషల్’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
థాయ్‌లాండ్, ఇండోనేషియా ప్రజలు కూడా ఏమంత తక్కువ కాదని తేలింది. థాయ్‌లాండ్ ప్రజలు రోజుకు 9 గంటల 11 నిమిషాలు ఇంటర్నెట్‌కే అంకితం అవుతుండగా, పొరుగుదేశం ఇండోనేషియా వాసులు రోజులో మూడో వంతు అంటే సగటున 8 గంటల 36 నిమిషాలు ఇంటర్నెట్‌లో పడి కొట్టుకుపోతున్నారట. ఇక, బ్రెజిల్, కొలంబియా దేశాలు ఈ జాబితాలో వరుసగా రెండు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ఇక, భారతీయులు సగటున రోజుకు 8 గంటలపాటు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.
అందరికంటే తక్కువగా జపాన్ ప్రజలు అతి తక్కువ సమయాన్ని ఇంటర్నెట్‌లో గడుపుతున్నారు. కేవలం 3 గంటల 45 నిమిషాలు మాత్రమే వారు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం జనాభాలో 57 శాతం మంది ఇంటర్నెట్‌తో అనుసంధానం అవుతున్నారు. సగటున రోజులో 6.5 గంటలు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని సర్వే నివేదిక పేర్కొంది.