jayram: హోటల్ దసపల్లాలో ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం... ఆ తర్వాతే జయరాం హత్య?
- సమావేశం తర్వాత తెల్లచొక్కా ధరించిన వ్యక్తితో బయటకు వెళ్లిన జయరాం
- కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
- దసపల్లా హోటల్‌లో పదిరోజులుగా జయరాం పేరున ఓ గది
ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై డొంకను కదిలిస్తున్నారు. హత్య జరిగిన రోజు అంటే గురువారం పలువురు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో జయరాం సమావేశమయ్యారని, ఈ సమావేశం అనంతరం తెల్ల చొక్కా ధరించిన ఓ వ్యక్తితో బయటకు వెళ్లిన జయరాం అనంతరం హత్యకు గురయ్యారని తేల్చారు.
హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో పది రోజులుగా జయరాం పేరున ఓ రూం బుక్ చేసి ఉండగా ఆ రూంలోనే జనవరి 31వ తేదీ గురువారం ఫార్మా కంపెనీ ప్రతినిధుల సమావేశం జరిగిందని తేల్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగానే జయరాంపై హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. జయరాం ప్రయాణిస్తున్న కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పంతంగి టోల్‌గేట్ వద్ద నమోదైన సీసీ టీవీ పుటేజీ ద్వారా బయటపడింది.
విజయవాడలోని పెనమూరులో ఉంటున్న జయరాం సోదరి కుమార్తె శిఖా చౌదరి (మేనకోడలు) ఈ హత్యోదంతంలో కీలక సూత్రధారి, పాత్రధారి అని నిర్థారణకు వచ్చారు. గత నెల 29న శిఖాచౌదరి ఇంటికి జయరాం వచ్చి వెళ్లినట్లు పోలీసులు నిర్థారించారు. జయరాం హత్య జరిగిన 31వ తేదీ రాత్రి 11 గంట సమయంలో జయరాం ఇంటికి శిఖాచౌదరి వెళ్లి, వాచ్‌మెన్‌ని బెదిరించి తాళాలు తీసుకుని ఇంట్లోకి ప్రవేశించినట్లు నిర్థారించారు. దీంతో శిఖాచౌదరి, ఆమె ప్రియుడు రాకేష్ చౌదరి, స్నేహితుడు శ్రీకాంత్‌రెడ్డి కలిసి ఈ హత్యకు ప్పాడినట్లుగా అనుమానిస్తున్నారు.
శిఖాచౌదరి, రాకేష్ ప్రేమ వివాహానికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదని, శిఖాని వదిలేస్తే మూడున్నర కోట్ల రూపాయలు ఇస్తామని రాకేష్‌తో బేరం పెట్టారని, ఆ డబ్బు ఇవ్వక పోవడం వల్లే ప్రేమికులు ఇద్దరూ ఒక్కటై ఇంతటి దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు.