Chandrababu: నవ్యాంధ్రలో నూతన అధ్యాయం.. నేడు హైకోర్టు భవనాన్ని ప్రారంభించనున్న సీజేఐ
- అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దిన సీఆర్‌డీఏ
- ఎనిమిదినెలల రికార్డు సమయంలో పూర్తి
- శాండ్‌స్టోన్ తాపడంతో మెరిసిపోతున్న భవనం
నవ్యాంధ్రప్రదేశ్‌లో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అత్యాధునిక వసతులతో, ఆకర్షణీయంగా నిర్మించిన హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేడు ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతిలోని న్యాయ నగరంలో నిర్మించిన ఈ జుడీషియల్ కాంప్లెక్స్‌లోనే ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తారు.
కేవలం ఎనిమిది నెలల కాలంలోనే సీఆర్‌డీఏ ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్‌స్టోన్‌తో తాపడం చేశారు. ఈ భవనం పక్కనే శాశ్వత హైకోర్టు భవనానికి కూడా నేడు శంకుస్థాపన చేయనున్నారు. శాశ్వత భవనం పూర్తయ్యాక అందులోకి హైకోర్టును తరలించి, ఇందులో సిటీ సివిల్ కోర్టులు, ట్రైబ్యునళ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. నిజానికి ఇంటువంటి భవనాన్ని నిర్మించేందుకు రెండేళ్లు పడుతుందని, కానీ తాము ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. మొత్తం నిర్మాణానికి రూ.173 కోట్లు అయినట్టు చెప్పారు.