TTD: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దోపిడీ.. మూడు కిరీటాలు మాయం!
- వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు మాయం
- గుర్తించి ఫిర్యాదు చేసిన మహిళా కానిస్టేబుల్
- సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవమూర్తులకు అలంకరించిన కిరీటాలు నిన్నటి నుంచి కనిపించడం లేదు. మాయమైన మూడూ వజ్రాలు పొదిగిన కిరీటాలు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కలియుగ దైవం తిరుమల వేంకటేశుని అన్నయ్యే గోవిందరాజస్వామి. తిరుపతి నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగలు పడి దోచుకెళ్లారా? లేక, ఇంకేమైనా జరిగిందా? అన్నదానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు రోజూ సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో స్వామివారితోపాటు అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తారు. స్వామి, అమ్మవార్లను అలంకరించేందుకు వజ్రాభరణాలు పొదిగిన ఆరు పురాతన కిరీటాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో వీటిని మూలవిరాట్టుకే ఉంచుతారు.
అయితే, శనివారం సుప్రభాత సేవలో కనిపించిన కిరీటాలు ఆ తర్వాత మాయమయ్యాయి. టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు తెలిపారు. వెంటనే విచారణ ప్రారంభించిన అధికారులు కిరీటాలను పర్యవేక్షించే సిబ్బంది, అర్చకులను పిలిపించి విచారించారు. మూడు కిరీటాలు మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు విచారణ వేగం పెంచారు.
గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారు శేషశయన భంగిమలో దర్శనమిస్తారు. రామానుజాచార్యులు స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. మూలవిరాట్టు గోవిందరాజస్వామితో పాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు విగ్రహాలు ఉన్నాయి. ఆలయం దక్షిణ భాగంలో రుక్మిణి, సత్యభామా సహిత పార్థసారధి మందిరం ఉంది.