Pakistan: నవాజ్ షరీఫ్ కు అస్వస్థత.. జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు
- షరీఫ్ లో గుండె సంబంధిత సమస్యలు అధికం
- ఆసుపత్రికి తరలించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు
- ప్రభుత్వ ఆదేశాలపై ఎటువంటి అభ్యంతరం లేదన్న మంత్రి
అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయన్ని ఆసుపత్రికి తరలించాలని పాక్ లోని పంజాబ్ ఫ్రావిన్స్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. నవాజ్ షరీఫ్ లో గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని గుర్తించిన వైద్యులు ఆయన్ని లాహోర్ లోని ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులకు సూచించారు. అదే సమయంలో షరీఫ్ కు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ విషయమై పంజాబ్ సమాచార శాఖ మంత్రి ఫయజుల్ హసన్ చౌహాన్ మాట్లాడుతూ, ఆరుగురు వైద్యులతో కూడిన బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా నవాజ్ షరీఫ్ ను ఆసుపత్రికి తరలించాలన్న నిర్ణయం తీసుకున్నామని అన్నారు. షరీఫ్ ను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు పూర్తయినట్టు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న షరీఫ్ కు జైల్లోనే అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు.
కాగా, షరీఫ్ వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ స్పందిస్తూ, షరీఫ్ ఆరోగ్యం మొదటి నుంచి బాగోలేదన్న విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా సరిగా స్పందించలేదని ఆరోపించారు.