SCR: రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు లభించిన వాటా ఇది!
- దక్షిణ మధ్య రైల్వేకు రూ. 5,942 కోట్లు
- కొత్త రైల్వే లైన్లకు అరకొర కేటాయింపులు
- సౌకర్యాలు, మౌలిక వసతులకు పెద్దపీట
- వెల్లడించిన ద.మ.రై అడిషనల్ జీఎం జాన్ థామస్
రెండేళ్ల నుంచి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కూడా విలీనం చేసి, ఒకేరోజు పార్లమెంట్ ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో రైల్వే శాఖ అద్భుతంగా పనిచేస్తోందని, ఈశాన్య భారతావనిని భారతీయ రైల్వేల పరిధిలోకి తెచ్చి మిజోరం వంటి రాష్ట్రాల్లోనూ రైళ్లు నడిపిస్తామని పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఇక బడ్జెట్ ప్రతులను మరింత విఫులంగా పరిశీలిస్తే, కొత్త రైళ్లు లేవు. ఉన్న రైళ్లలో టికెట్ ధరలను పెంచలేదు.
ఇక ద.మ.రైకు వచ్చిన వాటాపై అడిషనల్ జీఎం జాన్ థామస్ వివరిస్తూ, రానున్న ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి నిమిత్తం రూ. 5,924 కోట్లు రానున్నాయని అన్నారు. గతేడాదితో పోలిస్తే, రూ. 172 కోట్ల మేరకు నిధులు పెరిగాయని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని అన్నారు. కొత్త లైన్లకు రూ. 834 కోట్లు, రెండో లైన్లు వేసేందుకు రూ. 1,905 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల కొత్త లైన్ అందుబాటులోకి రానుందని అన్నారు. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్ కు రూ. 200 కోట్లు లభించాయని, మనోహరాబాద్ - గజ్వేల్ మార్గంలో కొత్త లైన్ ను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని అన్నారు. మునిరాబాద్ - మహబూబ్ నగర్ కొత్త లైనుకు రూ. 275 కోట్లు, హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పొడిగింపునకు రూ. 20 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
వీటితో పాటు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర పరిధిలోని బైపాస్ లైన్ల నిర్మాణానికి రూ. 143 కోట్లు, చర్లపల్లిలో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణానికి రూ. 5 కోట్లు, మౌలాలిలో రైల్వే ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ కోసం రూ. 1.5 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. కాజీపేటలోని రైల్వే వర్క్ షాపునకు రూ. 10 కోట్లు, కర్నూలులో మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం రూ. 80 కోట్లు, తిరుపతి రైల్వేస్టేషన్ లో వెనుకవైపు నుంచి ప్రవేశ మార్గం ఏర్పాటు నిమిత్తం రూ. 12.45 కోట్లు, తిరుచానూర్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 6 కోట్లు, మహారాష్ట్ర పరిధిలో ఉన్న ముద్ ఖేడ్ - పర్బనీ మధ్య రెండో లైను నిర్మాణానికి రూ. 34.50 కోట్లు కేటాయించినట్టు జాన్ థామస్ తెలిపారు.