Jayaprada: ఆ ఫొటోలు చూసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను.. మానసిక క్షోభ అనుభవించాను: సినీ నటి జయప్రద

  • రాజకీయాల్లో మహిళలకు ప్రతిక్షణం యుద్ధమే
  • ఆజంఖాన్ నన్ను చంపేందుకు ప్రయత్నించాడు
  • అమర్‌సింగ్‌తో నాకు సంబంధాలు అంటగడుతున్నారు

ముంబైలో జరిగిన క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సినీనటి, మాజీ ఎంపీ జయప్రద మాట్లాడుతూ రాజకీయంగా తాను ఎదుర్కొన్న పలు బాధాకర ఘటనల గురించి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ ఓసారి తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.

ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని  పేర్కొన్నారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతానో, లేదో కూడా తెలియడం లేదన్నారు. తనకు ఏ ఒక్క నాయకుడు మద్దతుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములాయం సింగ్ కూడా ఈ విషయంలో ముందుకు రాలేదన్నారు.

అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌లా భావిస్తుంటే కొందరు మాత్రం తమ ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నారు. అదే సమయంలో అమర్‌సింగ్ డయాలసిస్ చికిత్సలో ఉన్నారని, దీంతో ఏం చేయాలో తెలియక తాను అనుభవించిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదన్నారు.

చికిత్స అనంతరం అమర్‌సింగ్ తనకు చేయూత అందించినట్టు చెప్పారు. అలాంటి వ్యక్తిని తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నానని అన్నారు. ఆయనకు రాఖీ కట్టినా కొందరు లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారన్నారు. అయితే, ఇలాంటి కామెంట్లను, ఆరోపణలను తాను లెక్కచేయబోనన్నారు. రాజకీయాల్లో మహిళలు రాణించడమంటే యుద్ధం చేయడమేనని జయప్రద అన్నారు.

Jayaprada
Actress
Amarsingh
Mulayam singh
Politics
Azam Khan
  • Loading...

More Telugu News