Union Budget 2019-20: దేశంలోని సగం మందికి ఏదో ఒక విధంగా లాభం కలిగించేలా ఎన్ని'కలల' బడ్జెట్!

  • అన్ని వర్గాలకూ మేలు
  • మహిళలకు, రైతులకు పెద్ద పీట
  • మొత్తం మీద 33 కోట్ల మందికి లాభం

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ, దేశంలోని సగం మంది ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఏదో ఒక లాభం కలిగేలా మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రైతులు, మహిళలు, ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, వృద్ధులు... ఇలా ఎవరినీ వదలకుండా, ఏదో ఒక ప్రయోజనాన్ని నరేంద్ర మోదీ సర్కారు కళ్లముందుంచింది.

వ్యవసాయానికి సాలీనా రూ. 6 వేల పంట పెట్టుబడి సాయంతో దాదాపు 12 కోట్ల మంది రైతులకు లాభం కలగనుంది. మహిళలకు 8 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 8 కోట్ల కుటుంబాలు లాభపడతాయి. అసంఘటిత కార్మికులకు పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచడంతో సుమారు 10 కోట్ల మంది వరకూ లబ్దిని పొందనున్నారు. మధ్య తరగతి ఉద్యోగుల్లో పన్ను చెల్లిస్తున్న వారికి భారీ ఊరటను ఇస్తూ, పన్ను పరిమితిని రూ. 2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో మొత్తం మీద 33 కోట్ల మందికి ప్రత్యక్షంగా లబ్ది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దేశంలోని సగంమంది ఓటర్లకు (18 లోపు ఏళ్ల వయసున్న వారిని మినహాయిస్తే) లాభం చేకూర్చే నిర్ణయాలను పీయుష్ గోయల్ సభ ముందుంచారని భావించవచ్చు.

వీటితో పాటు సినిమాలు ఎక్కువగా చూసేవారు ప్రస్తుతం చెల్లిస్తున్న టికెట్ ధర కాస్తంతైనా తగ్గేలా జీఎస్టీ మినహాయింపును ప్రతిపాదించారు. ఇళ్లు కొనుగోలు చేసేవారికి జీఎస్టీని త్వరలోనే తగ్గిస్తామన్న శుభవార్తను చెప్పారు. రెండు ఇళ్లు ఉన్నవారికి, రెంటల్ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపులు వచ్చాయి. మొత్తం మీద ఇది ఎన్నికల బడ్జెట్ అని స్పష్టంగా తెలుస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Union Budget 2019-20
Piyush Goyal
  • Loading...

More Telugu News