cbi: సీబీఐ కొత్త డైరెక్టర్ ను నేడు ఎంపిక చేయనున్న మోదీ నేతృత్వంలోని కమిటీ
- కమిటీలో మోదీ, రంజన్ గొగోయ్, ఖర్గే
- జనవరి 24న తొలిసారి సమావేశమైన కమిటీ
- జనవరి 10 నుంచి ఖాళీగా ఉన్న సీబీఐ డైరెక్టర్ పదవి
ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నేడు సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్ ను ఎంపిక చేయనుంది. సెలెక్షన్ కమిటీ సమావేశం కావడం ఇది రెండో సారి. జనవరి 24న ఈ కమిటీ తొలిసారి సమావేశమైనప్పటికీ... సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.
గత సమావేశంలో సీబీఐ డైరెక్టర్ పదవికి అర్హులైన అధికారుల పేర్లను ప్యానెల్ పరిశీలించింది. ఆ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, 70 నుంచి 80 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. అయితే, వారి కెరీర్ వివరాలు, అనుభవాలను వివరించలేదని అన్నారు. అధికారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని తాను కోరానని తెలిపారు.
జనవరి 10 నుంచి సీబీఐ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మ తప్పుకోవడంతో సీబీఐకు రెగ్యులర్ చీఫ్ లేకుండా పోయారు. వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పదవికి మోదీ ఆధ్వర్యంలోని ప్యానెల్ బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక చీఫ్ గా నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.