industrialist murder: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్ జయరాంది హత్యే.. ప్రాథమికంగా తేల్చిన పోలీసులు

  • చంపేసి ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేశారన్న డీఎస్పీ
  • కారులోనే హత్య చేశారా, చంపేసి కారులో పడేశారా అన్నది తేలాల్సి ఉంది
  • హతుని కాల్‌ డేటాను విశ్లేషిస్తున్నాం

ప్రముఖ వ్యాపారవేత్త, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నివాసితుడు, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. జయరాంను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారని అర్థమవుతోందని డీఎస్పీ బోస్‌ తెలిపారు. కృష్ణా జిల్లా కీసర వద్ద కారులో అనుమానాస్పద స్థితిలో పడివున్న జయరాంను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

కారు వెనుక భాగంలో పడివున్న జయరాం తలకు బలమైన గాయాలు కావడం వల్లే చనిపోయినట్లు భావిస్తున్నారు. డీఎస్పీ కథనం మేరకు వివరాలిలావున్నాయి. జయరాంకు సంబంధించి ఒక ఫార్మా కంపెనీ కేసు, సీఐడీ కేసుతో మరో కేసు విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీన విజయవాడకు జయరాం వచ్చారు. మరుసటి రోజు జరిగిన కోస్టల్‌ బ్యాంకు బోర్డు మీటింగు‌కు హాజరయ్యారు. 21న తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

సొంత డ్రైవర్‌, గన్‌మెన్లు లేకుండా గురువారం తిరిగి విజయవాడకు వస్తుండగా రాత్రి పది గంటల సమయంలో జయరాంను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులు నిర్థారించారు. ఘటన జరిగిన రోజు జయరాంతోపాటు మరికొందరు అతని కారులో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఘటనతో వీరికి సంబంధం ఉందా, ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు జయరాం ఎవరెవరిని కలిశారు, ఏఏ లావాదేవీల విషయంలో వ్యవహారాలు నడిచాయన్న అంశాలపై పోలీసులు కూలంకుషంగా కూపీ లాగుతున్నారు.

జయరాం కాల్‌డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే జయరాంను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని డీఎస్పీ బోస్‌ తెలిపారు. హెమారస్‌ ఫార్మా కంపెనీగా ఎండీగా పనిచేస్తున్న జయరాం కొన్నాళ్లు ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

industrialist murder
Hyderabad
Vijayawada
costal bank
  • Loading...

More Telugu News