Pregnant woman: కూలిన ఇల్లు.. తన నలుగురు పిల్లల్ని కాపాడి ప్రాణాలు విడిచిన గర్భిణి
- బేకరీలో గ్యాస్ సిలిండర్ల పేలుడు
- మొదటి అంతస్తులో నలుగురు పిల్లలతో చిక్కుకుపోయిన గర్భిణి
- పిల్లల్ని కిందికి విసిరేసి మృతి చెందిన తల్లి
ఇల్లు కూలిన ఘటనలో తన నలుగురు పిల్లలను రక్షించిన తల్లి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో గురువారం జరిగిందీ విషాదం. బాధితురాలు ఫాతిమా (27) భర్త నడుపుతున్న బ్యాకరీలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో భవనం మంటల్లో చిక్కుకుంది. మొదటి అంతస్తులో ఉంటున్న ఫాతిమా తన నలుగురు పిల్లలతో కలిసి చిక్కుకుపోయింది. ఆమె 8 నెలల గర్భవతి కావడంతో చుట్టుముట్టిన మంటల నుంచి తప్పించుకోలేకపోయింది.
మరోవైపు, ఫాతిమా భర్త, అతడి సోదరుడు మంటలు ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే గుమిగూడిన స్థానికులు మంటల్లో చిక్కున్న చిన్నారులను కిందికి విసిరేయాల్సిందిగా కోరారు. దీంతో స్పందించిన ఫాతిమా తన నలుగురి పిల్లల్ని బాల్కనీలోకి తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరిని కిందికి విసరేసింది. కిందనున్న స్థానికులు వారిని జాగ్రత్తగా పట్టుకున్నారు. పిల్లల్ని రక్షించిన ఆమె మాత్రం మంటల్లో చిక్కుకుపోయి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే భవనం కుప్పకూలింది. కళ్లముందే జరిగిన ఈ ఘటన స్థానికుల్లో విషాదం నింపింది. తల్లిని కోల్పోయిన పదేళ్లలోపున్న ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.