Food poisoning: గుట్టు వీడింది.. ప్రేమికుడి భార్యను చంపేందుకే ప్రసాదంలో విషం కలిపిన మహిళ
- ఇంటి యజమానితో అఫైర్
- అతడి భార్యను చంపేందుకు ప్లాన్
- ప్రసాదంలో విషం కలిపి ఇచ్చిన నిందితురాలు
కర్ణాటక చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని గంగమ్మ ఆలయంలో ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో విస్తుపోయే నిజం వెల్లడైంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ప్రసాదాన్ని తయారు చేసిన లక్ష్మి అనే మహిళకు తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని లోకేశ్‌తో వివాహేతర సంబంధం ఉంది.
అతడి భార్య శ్రీ గౌరిని చంపేందుకు ప్లాన్ చేసిన లక్ష్మి ప్రసాదంలో విషం కలిపి దానిని పంచాల్సిందిగా తన ఇద్దరు సన్నిహితులకు ఇచ్చింది. దానిని వారు శ్రీగౌరికి తీసుకెళ్లి ఇచ్చారు. అయితే, శ్రీగౌరి దానిని తినకుండా తల్లి సరస్వతమ్మ (56)కు ఇచ్చింది. దానిని తిన్న ఆమె అస్వస్థతకు లోనైంది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే, ప్రసాదాన్ని తిన్న కవిత అనే మరో భక్తురాలు (26) కూడా మృతి చెందింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిజాలు నిగ్గు తేల్చారు. శ్రీగౌరిని చంపేందుకే లక్ష్మి (46) ప్రసాదంలో విషం కలిపినట్టు తేల్చారు. దీంతో లక్ష్మి, ఆమెకు సహకరించిన అమరావతి, పార్వతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గతంలో లక్ష్మి ఇచ్చిన ప్రసాదం తిని 15 రోజులపాటు ఆసుపత్రి పాలైనట్టు శ్రీగౌరి పోలీసులకు తెలిపింది. అప్పుడు తన ప్లాన్ వికటించడం వల్లే ఈసారి మరింత పకడ్బందీగా లక్ష్మి ప్లాన్ చేసిందని శ్రీగౌరి పోలీసులకు తెలిపింది. కాగా, ఈ ఘటనలో లోకేశ్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.