parlament session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తన సభ్యులకు విప్ జారీచేసిన కాంగ్రెస్
- మూడు లైన్లలో సమాచారం అందజేసిన అధిష్ఠానం
- నేడు, రేపు సభకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశం
- ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపధ్యంలో విపక్ష కాంగ్రెస్ పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. ముచ్చటగా మూడు లైన్లలో తన ఆదేశాలను అందులో పొందుపరిచింది. ఎన్నికల ముందు ముఖ్యమైన సమావేశాలు కావున సభ్యులంతా సభకు తప్పనిసరిగా హాజరై అవసరమైన సమయంలో పార్టీ నిర్ణయాలకు మద్దతు తెలపాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ విప్ జారీ చేయడం ఆసక్తిని కలిగించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్యం కారణంగా రాలేని పరిస్థితి ఉండడంతో, ఆయన స్థానంలో మరో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ శుక్రవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ సెషన్ కొనసాగనున్నది. ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితిలో ఉపయుక్తమవుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.